నర్సు యూనిఫాంలో మేయర్ ప్రత్యక్షం

ముంబై : కోవిడ్‌-19 విస్తృత వ్యాప్తితో చిగురుటాకులా వణుకుతున్న ముంబై మహానగరంలో ప్రజల్లో ధైర్యం నింపేందుకు స్వయంగా నగర మేయర్‌ రంగంలోకి దిగారు. బీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే బీవైఎల్‌ నాయర్‌ ఆస్పత్రిని సిటీ మేయర్‌ కిషోరి పెడ్నేకర్‌ సోమవారం సందర్శించారు. ప్రాణాలకు తెగించి కరోనా మహమ్మారిని ముందుండి ఎదుర్కొంటున్న ఆస్పత్రి సిబ్బందిని ప్రోత్సహించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు ఆమె నర్సు యూనిఫాంలో ప్రత్యక్షమయ్యారు. గతంలో నర్సుగా పనిచేసిన కిషోరి పెడ్నేకర్‌ ఆస్పత్రిలోని నర్సులతో కలిసిపోయి వారిని ఉత్తేజపరిచారు. మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.