సిటీబ్యూరో: 'చేతులుకాలాక ఆకులు పట్టుకోవడం..'ఈ సామెత పోలీసుల తీరుకు సరిగ్గా సరిపోతుంది. దిశ మిస్సింగ్ కేసు నమోదులో సైబరాబాద్ పోలీసులు చూపించిన నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అది పూర్తిగా మరువకముందే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో శరణప్ప కేసు వెలుగు చూసింది. అతడు మృత్యుముఖం వరకు చేరిన తర్వాత మేల్కొన్న బోయిన్‌పల్లి పోలీసుల నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వీరి వ్యవహారశైలిపై సిటీ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. మరోపక్క ఏదైనా ఉదంతం జరిగినప్పుడు హడావుడి చేడయం తప్ప చక్కదిద్దే చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శ ఉంది.
గత నెల ఆఖరి వారంలో దిశ మిస్సింగ్‌పై ఫిర్యాదు చేయడానికి ఆమె కుటుంబీకులు అర్ధరాత్రి వేళ పోలీసుల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో పరిధుల పంచాయితీ పెట్టుకున్న సిబ్బంది వారిని రెండు ఠాణాల మధ్య తిప్పడంతో పాటు కేసు దర్యాప్తులోనూ నిర్లక్ష్యం వహించారు. పోలీసులు సత్వరం స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే వాదనా వినిపించింది. ఈ ఘటనను పూర్తిగా మరువక ముందే నగరంలోని నార్త్‌జోన్ పరిధిలో ఉన్న బోయిన్‌పల్లి ఠాణాలో శరణప్ప కేసు వెలుగులోకి వచ్చింది. బోయిన్‌పల్లిలోని శివ ఎన్‌క్లేవ్‌లో ఓ వివాదాస్పద స్థలం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్న శరణప్పతో పాటు అతడి భార్యపై గురువారం సాయంత్రం దాడి జరిగింది. దీనిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నా నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ నిందితులే శనివారం సాయంత్రం శరణప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దుర్ఘటనలో అతడికి 40 శాతం కాలినగాయాలు కావడంతో ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు.
తీవ్ర సంచలనం సృష్టించే ఉదంతాలు చోటు చేసుకుంటేనే పోలీసులు దృష్టి పెడుతున్నారనే విమర్శ వస్తోంది. దిశ ఉదంతం తర్వాత రాజధానిలో మహిళల భద్రతకు పెద్ద పీట వేయడంతో పాటు డయల్–100, హాక్–ఐపై విస్తృత ప్రచారం చేయడం మొదలెట్టారు. పరిధుల పంచాయితీకి తావు లేకుండా 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు విధానానికి శ్రీకారం చుట్టారు. శరణప్పపై దాడి కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం ఫలితంగా అతడిపై హత్యాయత్నం జరిగిన తర్వాత స్థానిక పోలీసుల తీరును ఉన్నతాధికారులు తప్పుబట్టాకే స్పందన వచ్చింది. రెండు కేసుల్లోనూ నిందితులుగా ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నేరాలు చోటు చేసుకున్న తర్వాత స్పందించి, హడావుడి చేయడం కంటే వాటి నిరోధానికి పోలీసులు కృషి చేస్తే ఏ కుటుంబానికీ నష్టం జరగదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా ఓ సంచలనాత్మక కేసు జరిగితే పోలీసుల దృష్టి అంతా ఆ తరహా నేరాల పైనే ఉంటోంది. ఫలితంగా మిగిలిన కేసులు మూలనపడి మరో ఉదందం చోటు చేసుకుని ఇంకో కుటుంబం నష్టపోతోంది.